21st Jun : International Yoga day

ఎందరో యోగులు.. విశ్వవ్యాప్త గురువులు

వారు యోగర్షులు. భారతీయ యోగ శాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసినవారు. తరతరాల భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి కానుకగా ఇచ్చినవారు. యోగా సాధనలో జీవితాన్ని పునీతం చేసుకున్న వారు. యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా పాటించి ప్రజలందరికీ దగ్గర చేయాలని భారతదేశం చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలన్నీ ముక్తకంఠంతో ఒప్పుకున్నాయంటే.. అందుకు అప్పటికే ఆయా దేశాలకు యోగాతో పరిచయం ఉండటం, దాని ప్రత్యేకతలపై అవగాహన ఉండటమే ప్రధాన కారణం. అందుకు కృషి చేసినవారిలో టి.కృష్ణమాచార్య, బీకేఎస్‌ అయ్యంగార్‌, మహర్షి మహేష్‌ యోగి, స్వామి శివానంద తదితరులున్నారు.

టి.కృష్ణమాచార్య
ఆయుర్వేద వైద్య విధానాలను యోగాతో మిళితం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలను ఆవిష్కరించిన ఆధునిక యోగ సాధకునిగా టి.కృష్ణమాచార్య పేరుగాంచారు. ‘హఠ యోగ’ను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన ఘనుడాయన. మైసూర్‌ మహారాజ అండదండలతో దేశమంతటా పర్యటించారు. యోగాపై పెద్ద సంఖ్యలో ఉపన్యాసాలు, ప్రదర్శనలు ఇచ్చారు. ‘విన్యాస’ విద్యలో పేరుగాంచారు. యోగాతో శరీరంపై పూర్తిగా పట్టు సాధించవచ్చని నిరూపించారు. ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు, పద్యాలు రచించారు. కర్ణాటక లోని చిత్రదుర్గ ఆయన స్వస్థలం. నిండు నూరేళ్లు జీవించిన ఆయన 1989లో మరణించారు.
బీకేఎస్‌ అయ్యంగార్‌
టీ.కృష్ణమాచార్య శిష్యుల్లో ఒకరు. బీకేఎస్‌ అయ్యంగార్‌ చిన్నతనంలో ఎన్నో జబ్బులతో బాధపడ్డారు. అందువల్ల శారీరకంగా బలహీనంగా ఉండేవారు. ఆ సమయంలో యోగాతో ఆయనకు పరిచయం ఏర్పడింది. నిరంతర సాధనతో అందులో నైపుణ్యం సాధించారు. పతంజలి యోగ సూత్రాలను తనదైన శైలితో పరిపుష్టం చేసి ‘అయ్యంగార్‌ యోగా’ను ఆవిష్కరించారు. దాదాపు 70 దేశాల్లో శిష్యులను సంపాదించుకున్న ఘనత ఆయనకు ఉంది. 1966లో ఆయన రాసిన పుస్తక¹ం ‘లైట్‌ ఆన్‌ యోగా’ను 19 భాషల్లోకి అనువదించారు. దీన్ని యోగ బైబిల్‌ అంటారు.
స్వామి శివానంద
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో జన్మించి ఉత్తరాఖండ్‌లోని రుషీకేష్‌ను తన కార్యక్షేత్రంగా చేసుకున్న స్వామి శివానంద స్వతహాగా వైద్యుడు. బ్రిటిషు పాలనలో ఉన్న మలేషియాలో వైద్యుడిగా దశాబ్దకాలం పాటు సేవలు అందించారు. మనిషికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను వైద్యం పూర్తిగా నయం చేయలేకపోతోందనే ఆలోచనతో మథనపడుతూ ఉండేవారు. నలభై ఏళ్ల వయసులో స్వదేశానికి తిరిగివచ్చి వారణాసి, నాసిక్‌, రుషికేష్‌ తదితర ప్రదేశాలను సందర్శించారు. తర్వాత యోగా సాధకునిగా మారారు. యోగా సాధనలో పాటించాల్సిన 18 లక్షణాలను వివరిస్తూ ఒక గీతం రచించారు. హఠ యోగ, కర్మ యోగ, మాస్టర్‌ యోగలోని ప్రత్యేకతలను కలబోసి ‘త్రిమూర్తి యోగ’ను శిష్యులకు బోధించారు.
కె.పట్టాభి జోయిస్‌
‘అష్టాంగ యోగ’ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన విన్యాస యోగ సృష్టికర్త కె.పట్టాభి జోయిస్‌. 1927లో పన్నెండేళ్ల వయసులో కర్ణాటకలోని హసన్‌లో టి.కృష్ణమాచార్య ఉపన్యాసానికి హాజరైన తర్వాత ఆయనలో యోగపై ఆసక్తి పెరిగింది. వెంటనే ఆయన శిష్యబృందంలో చేరిపోయారు. దాదాపు రెండేళ్లపాటు అకుంఠిత దీక్షతో యోగాను సాధన చేశారు. దేశమంతటా పర్యటించారు. మైసూరు సమీపంలో యోగ సాధన క్షేత్రాలు నెలకొల్పి ఎందరికో యోగా గురు అయ్యారు.
మహర్షి మహేష్‌ యోగి
‘పారమార్థిక ధ్యాన’ విధానాన్ని ఆవిష్కరించిన యోగా గురు మహర్షి మహేష్‌ యోగి. పారమార్థిక ధ్యాన విధానంలో దాదాపు 50,000 మంది శిష్యులను తయారుచేశారు. ఈ పద్ధతికి ఆకర్షితులైన వారిలో ప్రఖ్యాత హాలీవుడ్‌ నటుడు క్లైంట్‌ ఈస్ట్‌వుడ్‌ ఒకరు. భారతదేశంతో పాటు కెనడా, యూఎస్‌, యూకే, స్విట్జర్లాండ్‌ తదతర దేశాల్లో ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. పారమార్థక ధ్యాన విధానాన్ని విశ్వవ్యాప్తంగా చేసిన ఘనత ఆయనకు సొంతం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ధ్యాన, విద్యా కేంద్రాలను స్థాపించారు.

 

 

వేదకాలం నుంచి ఆధునిక యుగం వరకు..
యోగా అత్యంత పురాతనమైనది. వేదకాలం నుంచీ దాని ప్రస్తావన ఉంది. ముఖ్యంగా రుగ్వేదంలో! క్రీ.పూ. 3000 సంవత్సరాల నుంచీ యోగ ప్రక్రియ కొనసాగుతున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. యోగ సంప్రదాయాన్ని గురించి విస్తృతంగా చర్చించిన గ్రంథం భగవద్గీత. క్రీ.పూ. 500 ప్రాంతానికి చెందిన ఈ ఉద్గ్రంథంలో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం వంటి రకరకాల యోగ భావనలపై సవిస్తరమైన చర్చ కనిపిస్తుంది. ఇంతటి విస్తృతార్థంలో చర్చనీయాంశంగా ఉన్న ‘యోగ’ సంవిధానానికి ఒక రకంగా క్రీ.శ. 200లలో పతంజలి మహర్షి తన ‘అష్టాంగ యోగం’ ద్వారా ఒక నిర్దిష్టత తీసుకువచ్చారు. వేదాలు, ఉపనిషత్తుల సహా సనాతన ఆలోచనా ధోరణిలో ఎక్కడెక్కడో ఉన్న సూత్రాలన్నింటినీ క్రోడీకరించి యమం, నియమం వంటి అంశాలతో ‘అష్టాంగ యోగ’ను సిద్ధం చేశారు పతంజలి మహర్షి. బహుళ ప్రాచుర్యం పొందిన ఈ అష్ట (8) సూత్రాల్లో మొదటి నాలుగూ బాహ్యమైన శరీరానికి సంబంధించినవి, చివరి నాలుగూ మన అంతరంగానికి, అంటే మనస్సుకు సంబంధించినవి. ఈ ఎనిమిదింటిలో మూడోది యోగాసనాలు. ఏడోది ధ్యానం, ఎనిమిదోది సమాధి! ఈ అష్టాంగాలను పరిశీలిస్తే మనకు యోగా అన్నది శరీరానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే.. మనసును కూడా దానికి జత చేస్తుందని, మనిషిని ఒక వ్యక్తిగానూ, సంఘజీవిగానూ, ముఖ్యంగా సుఖసంతోషాలతో జీవించే ఒక సమగ్ర ప్రాణిగా తీర్చిదిద్దేందుకు సమాయత్తం చేస్తుందని అర్థమవుతుంది. యోగ సాధనకు ఉన్న ఈ బలమే.. దీన్ని ఎల్లలు దాటేలా చేసింది.

తంత్రం బాటపట్టి..
పతంజలి మహర్షి కృషి తర్వాత.. రకరకాల యోగ సాధకులు శరీరానికి పునరుజ్జీవన శక్తులుసాధించి పెట్టటం, ఆయుర్దాయాన్ని విస్తరించటం వంటి లక్ష్యాలతో శారీరక అంశాలకు విపరీతమైన ప్రధాన్యం ఇస్తూ ‘తంత్ర యోగం’ వంటివాటిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. వీటిలో శుద్ధి, శోధన వంటి పేర్లతో శరీరానికీ, ప్రాణానికీ మిక్కిలి ప్రాధాన్యం ఇవ్వటం కనబడుతుంది. ఈ దశల నుంచి రూపుదిద్దుకుందే హఠయోగం. దేహంలోని వివిధ స్థాయుల్లో ఉండే కుండలిని, చక్రాల వంటివన్నీ ప్రాచుర్యంలోకి వచ్చాయి. అనంతర కాలంలో 1800, 1900 శతాబ్దాల్లో యోగ సాధకులు, గురువులు పాశ్చాత్య దేశాలను సందర్శించి యోగ విధానాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించటం ఆరంభించారు. 1893లో షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద యోగ సంప్రదాయాన్ని పాశ్యాత్య సమాజానికి బలంగా పరిచయం చేశారు. 1920, 30ల్లో టి.కృష్ణమాచార్య వంటివారు పాశ్చాత్య సమాజంలో హఠ యోగం స్థిరపడేలా చేశారు. ‘యోగా’ అంటే ఆసనాలు, శారీరక సాధనలే కాదనీ.. మానసికాంశాలకు విస్తృత ప్రాధాన్యం ఉన్నదని వారు చాటగలిగారు. ఆధునిక జీవన విధానంలోని ఒత్తిళ్లకు ఇదే నిజమైన ఔషధమన్న విశ్వాసాన్ని పాదుకొల్పటంలో వీరు కృతకృత్యులయ్యారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s