Switzerland travelogue

స్విట్జర్లాండ్‌ పిలిచింది..!

‘పచ్చని పచ్చిక మైదానాల్నీ ఎత్తైన కొండల్నీ లోతైన లోయల్నీ ఉరికే జలపాతాల్నీ దాటుకుంటూ, నీలాల సరస్సుల్లో విహరిస్తూ, గాలికెరటాల్లో తేలియాడుతూ, తెల్లని మేఘాల పరదాల్ని చీల్చుకుంటూ, చల్లని మంచుకొండలమీద చెట్టపట్టాలేసుకుని చక్కర్లు కొట్టాలనుకునేవాళ్లు భూతలస్వర్గంగా పిలిచే స్విట్జర్లాండ్‌ను ఒక్కసారయినా సందర్శించాల్సిందే’ అంటున్నారు విజయవాడకు చెందిన మన్నం ఉషాకిరణ్‌.

ఎప్పటినుంచో స్విట్జర్లాండ్‌ చూడాలన్న కోరికతో నెదర్లాండ్స్‌ ఐండోవన్‌లోని అన్నయ్య వాళ్ల ఇంటి నుంచి అమ్మానాన్నలతో కలిసి ఉదయాన్నే బయలుదేరాం. దాదాపు రెండున్నరవేల కిలోమీటర్లు… కారులోనే ప్రయాణం… ముందుగా బెల్జియం మీదుగా లక్జంబర్గ్‌ అనే చిన్న దేశానికి చేరుకున్నాం. ఆ దేశ రాజధానికి కూడా అదే పేరు. నగరంతోబాటు అక్కడి పురాతన రాజప్రాసాదం, మార్కెట్లను చూస్తూ ఓ గంట సేపు తిరిగాం. అక్కడి నుంచి ఫ్రాన్స్‌ మీదుగా ప్రయాణించి సాయంత్రానికి స్విట్జర్లాండ్‌లోకి అడుగుపెట్టాం. పర్యావరణ టోల్‌ ట్యాక్సు చెల్లించి కారు పర్మిట్‌ స్టిక్కరు తీసుకుని రైనే జలపాతంవైపు వెళ్లాం.నయాగరా జలపాతంతో పోలిస్తే రైనె జలపాతం చిన్నదే. కానీ 75 అడుగుల ఎత్తులో 450 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ జలపాతంలో ఏదో ప్రత్యేకత. పైగా ఐరోపాలోని సమతల నీటి జలపాతాల్లోకెల్లా ఇదే పెద్దది. ఈ జలపాతానికి దగ్గరలోనే న్యూహసన్‌ గుహలు ఉన్నాయి. వాటిని సందర్శించాక జలపాతానికి ఇరువైపులా దాన్ని దగ్గరగా చూసేందుకు పర్యటకులకోసం ప్లాట్‌ఫామ్‌లు నిర్మించారు. ఈ జలపాతం కిందకి దూకి నదిగా మారే ప్రదేశం మధ్యలో రైనేఫాల్‌ ఫెల్సిన్‌ అనే పెద్ద బండరాయి ఉంది. ఇది చాలా లక్షల సంవత్సరాల నాటిదిగా చెబుతారు. జలపాతానికి దిగువనే పారే నదిలో పడవలు తిరుగుతుంటాయి. ఆ పడవల ద్వారా సందర్శకులు ఆ బండరాయి వరకూ వెళ్లి వస్తుంటారు. మేం కూడా కాసేపు అక్కడ పడవలో విహరిస్తూ ఆ జలపాత అందాల్లో తడిసి ముద్దయ్యాం. జలపాతం దిగువనుంచి మలుపు తీసుకుని, కొండలమీదుగా జలపాతం పైకి రైల్లో ప్రయాణిస్తూ ఆ రైనే జలపాత అందాల్ని చూడటం మరిచిపోలేని అనుభూతిని కలిగించింది.

జ్యురిచ్‌ వెలుగుల్లో…
తరవాత జ్యురిచ్‌ నగరానికి బయలుదేరాం. నగరం మరో 20 కి.మీ. ఉందనగా వచ్చే రాఫ్ట్‌ అనే పల్లెలో ఆ రాత్రికి బస చేశాం. ఉదయాన్నే బయలుదేరి జ్యూరిచ్‌ నగరానికి చేరుకున్నాం. ఇక్కడ పన్నులు తక్కువే. కానీ చాలా ఖరీదైన నగరం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక నగరాల్లో ఇదొకటి. స్విట్జర్లాండ్‌ దేశంలోని ముఖ్య బ్యాంకులూ పరిశోధన కేంద్రాలూ అన్నీ ఇక్కడే ఉన్నాయి. జ్యూరిచ్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతమే నగరానికి ప్రధాన వ్యాపార కూడలి. జ్యూరిచ్‌ సరస్సు దిగువ భాగంలో ప్రయాణించే లిమ్మాట్‌ నది చుట్టూ ఈ సుందర నగరాన్ని నిర్మించారు. మేం రైల్వే స్టేషన్‌ దగ్గరే కారు పార్కు చేసుకుని విద్యుద్దీపాల వెలుగులో స్థిమితంగా రెండు గంటలపాటు నగర వీధుల్లో పర్యటించాం. నిజానికి పగటివేళలో అక్కడ బస చేయగలిగితే మేలు. జ్యూరిచ్‌ కళల మ్యూజియం, బొటానికల్‌ ఉద్యానవనమూ, ఫిపా ప్రపంచ ఫుట్‌బాల్‌ మ్యూజియమూ ప్రార్థనామందిరాలూ… ఇలా చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ సమయం చాలదని ఆ రాత్రికి మళ్లీ మేం బస చేసిన రాఫ్ట్‌ పల్లెకి తిరిగి వచ్చేశాం.

పర్వతాన్ని చుట్టి వచ్చాం!
మర్నాడు మేం పిలాటుస్‌ పర్వతయాత్రకు బయలుదేరాం. స్విట్జర్లాండ్‌ వచ్చిన సందర్శకుల్లో చాలామంది టిట్లిస్‌ పర్వతానికే వెళుతుంటారు. కానీ కొందరు పర్వతారోహకుల సలహా తీసుకుని పిలాటుస్‌ను ఎంపికచేసుకుని అటు వెళ్లాం. రాఫ్ట్‌ నుంచి 80 కి.మీ.దూరంలోని ల్యూసెర్న్‌ పట్టణ సమీపంలోని క్రియొన్స్‌కి చేరుకున్నాం. ‘పిలాటుస్‌ గోల్డెన్‌ రౌండ్‌ ట్రిప్‌’ టిక్కెట్లు కొనుక్కుని బయలుదేరాం. ఒకవైపు నుంచి కేబుల్‌ కారులో పిలాటుస్‌ పర్వతశిఖరంమీదకి చేరుకుని, అక్కడ నుంచి రైల్లో మరోదిశగా పర్వతం కిందకివచ్చే ఈ యాత్ర ఐదు అంచెలుగా సాగుతుంది.

మొదటి దశలో క్రియొన్స్‌ నుంచి క్రియెన్సెరిగ్‌, ఆ తరవాత ప్రాన్‌మున్‌టెగ్‌ వరకూ పనోరమిక్‌ గండోలా అని పిలిచే కేబుల్‌ కారులో ప్రయాణించాం. పచ్చదనంతో నిండిన కొండలమీదుగా 45 డిగ్రీల వాలులో ఈ ప్రయాణం 25 నిమిషాలపాటు సాగుతుంది. అక్కడకు వెళ్లాక ప్రాన్‌మున్‌టెగ్‌ అనే నది మధ్యలో ఓ విడిది ప్రదేశం ఉంది. ఒకవైపు ఎత్తైన కొండ, మరో వైపు లోతైన లోయ, మూడోవైపుకి చూస్తే ల్యూసెర్న్‌ సరస్సుతో కూడిన సుందర ప్రదేశం అది. రెస్టారెంట్లు కూడా ఎంతో అందంగా ఉంటాయి. ఫలహారాలు తిన్నాక అక్కడ ఉన్న అమ్యూజ్‌మెంట్‌ పార్కులోకి వెళ్లాం. చెట్లకాండంమీద ఏర్పాటుచేసిన చిన్న మెట్లను ఎక్కుతూ చెట్టు పై భాగానికి ఎక్కడం వింత అనుభూతిని కలిగించింది. చిన్నతనంలో చెట్టెక్కే అలవాటు బొత్తిగా లేనివాళ్లకి ఇదో పెద్ద సాహసమే. ఆ తరవాత సమతలంలో సమాంతరంగా కట్టిన తాళ్లలో పై దాన్ని పట్టుకుని కింది తాడుమీద నడవాలి. ఇది నిజంగా సాహసక్రీడే. ఏమాత్రం తడబడినా అంతేసంగతులు. ఆపై వాలుగా అమర్చిన సొరంగాల్లో ప్రయాణించి చిన్నపిల్లల్లా సంతోషపడ్డాం. తరవాతి దశలో కిందకి చూస్తే ఒళ్లు గగుర్పొడిచే లోయమీదుగా పిలాటుస్‌ శిఖరం మీదకి కేబుల్‌ బస్సులో పది నిమిషాలపాటు ప్రయాణం… దీన్నే డ్రాగన్‌ ప్రయాణంగా పిలుస్తారు. ఈ పర్వతమ్మీద మూడు శిఖరాలు ఉన్నాయి. ఒక్కో శిఖరం సముద్రమట్టం నుంచి ఏడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. మేం పర్యటించింది వేసవిలోనే అయినా అక్కడ ఉష్ణోగ్రత ఐదారు డిగ్రీల సెల్సియస్‌కు మించదు. వేసవిలో తప్ప మిగిలిన సమయాల్లో ఇక్కడ మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది. కొండ శిఖరం ఎక్కి చుట్టూ చూస్తే ప్రపంచాన్ని జయించినంత గర్వంగానూ ఎవరెస్ట్‌ ఎక్కినంత ఆనందంగానూ అనిపించింది. అలా అక్కడ రెండుగంటలపాటు చుట్టూ చూస్తూ మైమరిచిపోయాం. సమయం ఎలా గడిచిపోయిందో తెలీదు. మరికొంచెం సేపు ఇక్కడే ఉంటే బాగుణ్ణు అనిపించింది. మూడో దశలో భాగంగా పిలాటుస్‌ పర్వతం వెనక భాగం నుంచి కోగ్‌ రైలుపెట్టెలో కిందకి ప్రయాణించాం. దట్టమైన చెట్లూ, సొరంగాలూ, వంతెనలూ, కొండ మలుపుల గుండా సాగే ఈ ప్రయాణం అందించే అనుభూతిని అనుభవించాల్సిందేగానీ వర్ణించలేం. ప్రపంచంలోకెల్లా ఏటవాలుగా ఉండే రైలుమార్గం ఇదే. సుమారు 50 నిమిషాల రైలు విహారం తరవాత పర్వతం దిగువన ఉన్న ఆర్పానాస్టెడ్‌ జంక్షన్‌ దగ్గరకు చేరుకున్నాం. తినుబండారాలు, వస్తు దుకాణాలతో ఉన్న ఈ ప్రదేశంలో ఓ గంటసేపు సేదతీరాం.

మా యాత్రలోని నాలుగోదశలో ఆల్పానాస్టెడ్‌ నుంచి ఓ పెద్ద పడవలో ల్యూసెర్న్‌ సరస్సులో ప్రయాణించడం నిజంగా అద్భుతమే. మధ్యమధ్యలో ఆగుతూ ప్రకృతి సౌందర్యాన్ని గుండెలనిండుగా నింపుకుంటూ సాగే ఈ ప్రయాణం ఆహ్లాదభరితంగా అనిపించింది. చుట్టూ పచ్చని పర్వతాలూ వాటి మధ్యలోంచి దూకే చిన్న చిన్న జలపాతాలూ మనోల్లాసాన్ని కలిగిస్తాయి. ఈ ప్రయాణం అనంతరం ల్యూసెర్న్‌ కూడలికి వెళ్లాం. ఐదోదశలో ల్యూసెర్న్‌ కూడలి నుంచి ఒకటో నంబరు రూటులో రెండు పెట్టెల బస్సులో ప్రయాణించి క్రియొన్స్‌ కారు పార్కింగు దగ్గరకు చేరుకోవడం ద్వారా యాత్ర ముగిసింది.

ల్యూసెర్న్‌ పట్టణంలో…
ఆ రోజు సాయంత్రం ల్యూసెర్న్‌ పట్టణాన్ని చూడ్డానికి బయలుదేరాం. 1333వ సంవత్సరంలో చెక్కతో కట్టిన 200 మీటర్ల పొడవుగల చాపెల్‌మీద నడవడం ఓ వింత అనుభూతిని అందించింది. ఇది 1993లో అగ్నిప్రమాదంలో కాలిపోయిందట. అయితే ఏడాదిలోనే దీన్ని అంతే అందంగా మరింత సురక్షితంగా నిర్మించారు. పాదచారులు ఈ వంతెనమీద నడిచేటప్పుడు పై కప్పు కింద ఒకదాని తరవాత ఒకటి వరసగా అమర్చిన 30 తైలవర్ణ చిత్రపటాలు ల్యూసెర్న్‌ చరిత్రనూ క్యాథలిక్కుల సంస్కృతినీ తెలియజేస్తాయి. దీని తరవాత లయన్‌ మెమోరియల్‌ దగ్గరకు వెళ్లాం. ఫ్రెంచ్‌ విప్లవం సందర్భంగా మరణించిన స్విస్‌ గార్డుల స్మృత్యర్థం దీన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించారు. కొండకి దిగువ భాగంలో పదిమీటర్ల వెడల్పూ ఆరుమీటర్ల ఎత్తులో చెక్కిన ఈ సింహం ప్రతిమ సందర్శకుల్ని ఆకర్షిస్తుంటుంది. రాత్రి వేళలో ల్యూసెర్న్‌ అందాలను తిలకించి భోజనానంతరం సరస్సు ఒడ్డునే ఉన్న హోటల్లో బస చేశాం. ఆ మర్నాడు అక్కడ నుంచి ఆస్ట్రియా దేశానికి బయలుదేరాం. నిటారుగా ఉండే కొండలూ పక్కనే నది, ఆ నది పక్కనే నిర్మించిన విశాలమైన రోడ్డుమీద మా రెండు గంటల ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఈ ప్రయాణం మధ్యలో లీచ్‌టెన్‌స్టైన్‌ అనే చిన్న దేశం వచ్చింది. స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా దేశాల మధ్య గల ఈ దేశాన్ని దాటి వెళ్లడానికి పది నిమిషాలే పట్టిందంటే అది ఎంత చిన్న దేశమో అర్థమవుతుంది. మధ్యాహ్నానికి ఆస్ట్రియా దేశంలోని పెల్డ్‌కిర్చి అనే పట్టణానికి చేరుకుని, అక్కడ కాసేపు గడిపి, సాయంత్రానికి ఆస్ట్రియా గ్రామీణ వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ‘షిలిన్స్‌ రోన్స్‌బెర్గ్‌’ అనే ప్రదేశానికి చేరుకున్నాం. అక్కడ ఆస్ట్రియా వంటకాలతో భోజనం చేసి రాత్రికి విశ్రాంతి తీసుకున్నాం. ఉదయాన్నే ఆస్ట్రియా నుంచి జర్మనీలోని స్టూట్‌గార్డ్‌, ఫ్రాంక్‌ఫర్ట్‌ల మీదుగా స్విస్‌ అందించిన మధురానుభూతుల్ని తలచుకుంటూ సాయంత్రానికి తిరిగి ఐండోవన్‌కి చేరుకున్నాం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s