NGO : తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం

రోజూ 500 మందికి అన్నదానం

ఆకలి బాధ తెలిసిన ఓ సాధువు, ఆ బాధ మరెవరికీ ఉండకూడదని భావించి తను భిక్షాటన చేసిన బియ్యంతోనే అన్నం వండి, బతికున్నన్నాళ్లూ పదిమంది ఆకలీ తీర్చారు. ఆయన ఆశయం ఓ సంస్థానంగా ఏర్పడి ఇప్పటికీ రోజుకు 500 మంది కడుపు నింపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రఘుదేవపురం ఈ గొప్ప కార్యక్రమానికి వేదికైంది.

లా బతకండి… అంటూ మన జీవితాలకు దిశానిర్దేశం చేసే వ్యక్తినే గురువు అంటాం. ‘మన బతుకులే కాదు మన పక్కవారి కష్టాలనూ పట్టించుకుంటూ సమాజాన్నీ కుటుంబంగా భావిస్తూ జీవితాన్ని సాగించండి’ అని చెప్పే వ్యక్తుల్ని సద్గురువులుగా చెబుతాం. భారతదేశంలో అలాంటి గురువులు చాలా మందే కనిపిస్తారు. అలాంటి గురువుల్లో ఒకరే సద్గురు చిట్టిబాబాజీ. 1960ల్లో తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని రఘుదేవపురానికి భిక్షాటన చేస్తూ వచ్చిన ఆయన తర్వాత ఆ గ్రామ ప్రజలతో పాటు ఎంతో మంది ఆరాధించే వ్యక్తిగా మారారు. ఆయన ఆశయాలతోనే ఇప్పుడక్కడ చిట్టిబాబా సంస్థానం నడుస్తోంది. రోజుకి కనీసం 500 మందికి భోజనం పెడుతూ, చిన్నకారు రైతులకు చేతనైనంత సహాయం చేస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ తరహాలో సమాజానికి సేవలందిస్తోంది.

ఆకలి బాధ తెలుసు…
వూరూరా తిరుగుతూ భిక్షాటన చేసే సాధువులు మనకు తెలుసు. చిట్టి బాబాజీ కూడా అలా భిక్షాటన చేస్తూనే సీతానగరం ప్రాంతానికి వచ్చారు. ఆ క్రమంలో ఎన్నో సార్లు ఆకలిబాధను అనుభవించారు. అందుకే ఎవరికీ ఇలాంటి బాధ ఉండకూడదు అనుకున్నారు. తను భిక్షాటన చేసేప్పుడు తన పొట్టకు సరిపోయేంత మాత్రమే కాకుండా ఇంకొంత మందికి పెట్టగలిగేంత తెచ్చేవారు. ఆయన ఉండే ఓ పూరిపాకలోనే అన్నం వండి కనిపించిన పేద వాళ్లను పిలిచి పెట్టేవారు. వాళ్ల ఆకలి తీర్చడం ఆయనకు ఎంతో సంతోషాన్నిచ్చేది. అందుకే దాదాపు రోజూ అలా ఆకలిగొన్న వాళ్లకు అన్నం పెట్టేవారు. ఆయన చేస్తున్న పనిని గమనించిన గ్రామస్థుల్లో కొందరు ఆయనకు సహాయం చేయడం ప్రారంభించారు. అలా దాతల సహకారంతో చిన్న ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని నిత్యాన్నదానం మొదలు పెట్టారు బాబా. ఆ ఆశ్రమానికి శ్రీనామపండరీ క్షేత్రంగా నామకరణం చేశారు. ఆపదలో ఉన్న వాళ్లకి తనకు చేతనైనంత సహాయం చేయడంలోనూ ఆయన ముందుండేవారు. అలా తను బతికున్నన్నాళ్లూ ఎదుటివారికి సాయపడుతూ 1997లో రథసప్తమి రోజున మహా సమాధి చెందారు. ఆ తర్వాత ఆయన అనుచరులు గురునిలయంగా ఆ సంస్థానంలో అన్నసమారాధనతోపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను ప్రారంభించి, విస్తరించారు. కులమతాలకతీతంగా ఈ సంస్థానం తరఫున ఎంతో మంది సేవలు పొందుతున్నారు. ఎందరో దాతలు, ప్రముఖులు ఇక్కడి సేవా కార్యక్రమాలకు మెచ్చి సంస్థానానికి అనేక విధాలుగా సహాయం చేస్తున్నారు.

అన్నదానమే ప్రథమం
ఇక్కడ అన్నం తినేందుకు వీలుగా రాతి బెంచీలతో విశాలమైన హాలు ఉంటుంది. ఆకలి అంటూ ఏ సమయంలో ఇక్కడికి ఎవరు వచ్చినా అన్నం పెడతారు. ప్రతి సోమవారం చిట్టిబాబా ఆరాధన దినం సందర్భంగా కనీసం వెయ్యి మందికి అన్నదానం జరుగుతుంది. ఇక్కడ పాలకడలి పేరుతో గోశాలను నిర్వహిస్తున్నారు. ఆలయానికి సంబంధించి మొత్తం 300 దాకా ఆవులున్నాయి. వాటి నుంచి వచ్చే పాలను అన్నసమారాధనలో వాడతారు. ఆ ఆవుల మూత్రం, పేడలతో జీవం, జీవామృతం పేర్లతో ఎరువుల్ని తయారు చేస్తున్నారు. వాటిని చుట్టుపక్కల ఉన్న చిన్న రైతులకు ఉచితంగా అందిస్తూ సేంద్రియ సాగు పట్ల వాళ్లకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఈ అన్నదానానికి కావలసిన కూరగాయలు, బియ్యాన్ని పండించేందుకు దాతలు ఇచ్చిన 20 ఎకరాల భూమిలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. అన్న సమారాధనకు పోగా మిగిలిన కూరగాయల్ని ‘సహజ’ పేరుతో హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి…లాంటి చోట్ల నామమాత్రపు ధరకు అమ్ముతున్నారు. అలాగే బాబాకు ఇష్టమైన రోజుల్లో ఆయన అనుచరులంతా ఇప్పటికీ ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి వచ్చిన బియ్యాన్ని అన్నదానానికి ఇస్తారు.

పేదలకు ‘కవచం’
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడూ, ప్రసవ సమయంలోనూ, మరేదైనా అనారోగ్య సమస్య వల్ల ఎవరైనా అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినప్పుడూ అలాంటి వాళ్లకు ఉచిత సేవలందించేలా ‘కవచం’ పేరుతో అంబులెన్సును ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఆక్సిజన్‌, ఇతర ప్రథమచికిత్సా పరికరాలు సైతం వాహనంలో అందుబాటులో ఉంటాయి. ఇద్దరు నిపుణులైన సహాయకులు ఇందులో ఉంటారు. సకాలంలో బాధితుల్ని ఆసుపత్రులకు తరలించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిందీ కవచం. సీతానగరం మండలంలోని వివిధ గ్రామాల్లో సంస్థానం తరఫున రహదారుల వెంబడి మొక్కలను నాటించి, వాటిని సంరక్షించడానికి మనుషులను ఏర్పాటు చేసి పెద్దవయ్యేలా చేశారు.

ఆధ్యాత్మిక బాటలో…
ఆధ్యాత్మికతే మంచి సమాజానికి పునాది వేస్తుందని నమ్మేవారు చిట్టిబాబాజీ. అందుకే సంస్థానంలో రోజూ హోమం, ప్రతి ఏకాదశి, సోమవారాల్లో ప్రత్యేక పూజలూ నిర్వహిస్తారు. 108 రామకోటి స్తూపాలు, 108 బిల్వ వృక్షాలు, 108 తులసీ బృందావనాలు, 108 జ్యోతి స్వరూప నందదీపాలు, 108 పాండురంగ విగ్రహాలు, 108 గోవులు ఉండేలా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఏటా ఆశ్వయుజ పౌర్ణమికి బాబా జయంతి ఉత్సవాలతోపాటు, రథ సప్తమి నుంచి వారం రోజుల పాటు ఆరాధనోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు.

సంస్థానాన్ని చేరేందుకు రాజమండ్రి గోకవరం బస్టాండ్‌ నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు ఉంది. ఆటోలు కూడా తిరుగుతుంటాయి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s